Sub-station: తవ్వేకొద్దీ బయటకొస్తున్న చదలవాడ మోసాలు.. విస్తుపోతున్న అధికారులు!
- వివిధ రాష్ట్రాల్లో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం
- బ్యాంకుల నుంచి తొలుత రుణాలు
- ఆపై పైసా కూడా లేదంటూ బ్యాంకులకు ఎగనామం
- ఒక్కొక్కరుగా బయటకొస్తున్న బాధితులు
‘గుడ్‌విల్’ పేరుతో బ్యాంకులను రూ.185 కోట్లకు ముంచిన ప్రకాశం జిల్లాకు చెందిన చదలవాడ రవీంద్రబాబు మోసాలు తవ్వేకొద్దీ బయటకొస్తున్నాయి. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లను నిర్మించిన రవీంద్రబాబు ఆరేళ్ల కాలంలో బ్యాంకుల నుంచి ఇంత పెద్దమొత్తంలో రుణాలు ఎలా తీసుకున్నాడో తెలియక పోలీసులే విస్తుపోతున్నారు. హైదరాబాద్‌లోని నాచారం ఎస్బీఐ బ్రాంచ్ నుంచే వేర్వేరు రాష్ట్రాల్లో రూ.185 కోట్లు చెల్లించారు. అంటే.. బెంగళూరులో సబ్‌స్టేషన్ నిర్మాణానికి కాంట్రాక్ట్ దక్కించుకుంటే ఆ పత్రాలను నాచారం బ్యాంకులో సమర్పించడం ద్వారా బెంగళూరు శాఖల నుంచి రుణం పొందాడన్నమాట.
చదలవాడ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ పేరుతో ఇలా తీసుకున్న రుణాలను ఒకటి రెండు వాయిదాలు చెల్లించి ఆ తర్వాత చేతులు ఎత్తేయడాన్ని చదలవాడ అలవాటుగా చేసుకున్నాడు. రూపాయి కూడా తన వద్దలేదని ఆయన తేల్చి చెప్పేయడంతో ఏం చేయాలో పాలుపోని బ్యాంకులు చివరికి పోలీసులను ఆశ్రయించాయి.
పలు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో సబ్ స్టేషన్లు నిర్మించిన చదలవాడ ఆయా ప్రభుత్వాల నుంచి కోట్లాది రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా తీసుకున్నాడు. ఒక్క చత్తీస్‌గఢ్‌లోనే 90 స్టేషన్లు నిర్మించిన ఆయన మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.2.1 కోట్లను తన జేబులో వేసుకున్నాడు. అంతేకాదు, చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన కె.మోహనరావు నుంచి రూ.2 కోట్లు తీసుకుని రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. తొలుత ఇస్తానని చెప్పిన సీఎండీ పోస్టును కూడా ఇవ్వను పొమ్మన్నాడు.
చదలవాడ చేతిలో మోసపోయిన స్థానిక కాంట్రాక్టర్లు పోలీసులను ఆశ్రయించారు. ముంబైలో ఒకరికి రూ.60 లక్షలు, నెల్లూరులో మరొకరికి రూ.78 లక్షలు ఇవ్వాల్సి ఉండగా వారికీ ఎగనామం పెట్టాడు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ రామ్‌కుమార్ బృందం ఈ కేసును విచారిస్తోంది.