Andhra Pradesh: గేమింగ్ రంగంపై ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తాం: ఏపీ ప్రభుత్వం
- దేశంలోనే తొలిసారిగా అమరావతిలో 500 మందికి శిక్షణ
- బీటెక్, డిగ్రీ పాసైన విద్యార్థులకు అవకాశం
- ఈ నెల 11వ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఇండియన్ గేమింగ్ డెవలప్ మెంట్ ఛాలెంజెస్ పేరిట దేశంలోనే తొలిసారిగా అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో 500 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్ డీసీ), ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ), కజాని యూనివర్సిటీ సంయుక్తంగా ఈ శిక్షణ ఇవ్వనున్నాయని పేర్కొన్నారు.
గేమింగ్ రంగంపై ఆసక్తి ఉండడంతోపాటు తమ ఆలోచనలను స్టార్టప్ లుగా మార్చాలన్న లక్ష్యం ఉన్న వారు http://engineering.apssdc.in/igdc లో లాగిన్ అయి ఈ నెల 11వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. బీటెక్, డిగ్రీ పాసైన వారితోపాటు ఆయా కోర్సుల్లో రెండో సంవత్సరం చదువుతున్నవారు, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ పాసైన వారితోపాటు మొదటి సంవత్సరం చదువుతున్నవారు, డిప్లొమా పాసైన వారంతా ఇండియన్ గేమింగ్ డెవలప్ మెంట్ చాలెంజ్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీఎస్ఎస్ డీసీ అధికారులు తెలిపారు. వాస్తవానికి కోర్సు ఫీజు రూ.16,500 అయినప్పటికీ కేవలం రూ.1,500 కే ఆఫర్ చేస్తున్నామని, మిగతా ఫీజంతా ఏపీఎస్ఎస్ డీసీ భరిస్తుందని, శిక్షణా కాలంలో ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలోనే ఉచిత వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
కాగా, ఇప్పటికే తొలివిడతగా ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులకు ఐదు రోజులుగా గేమింగ్ రూపకల్పనలో ఫిన్ ల్యాండ్ కు చెందిన అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో పలువురు టీమ్ సభ్యులు గేమింగ్ రంగంలో ఆలోచనా విధానం, భవిష్యత్ ప్రణాళికలను ప్రజెంటేషన్ రూపంలో వివరించి ఫ్యాకల్టీల ప్రసంశలు పొందారు. శిక్షణ మొదలైన ఐదురోజుల్లోనే విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారని అధ్యాపకులు అన్నారు.
వచ్చే నెలలో ఫిన్ ల్యాండ్ నుంచి ప్రముఖ గేమింగ్ కంపెనీలన్నీ ఇక్కడకు వస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు రూపొందించిన గేమ్స్ ఆయా కంపెనీల ప్రతినిధులకు నచ్చితే ఉద్యోగంతోపాటు ఇతర అన్ని రకాల ఆర్థికసహాయం చేస్తారని తెలిపారు. అంతేకాకుండా ఈ శిక్షణలో ప్రతిభ కనబరిచిన టీమ్ లను స్లష్ (SLUSH)-2018 పేరుతో ఫిన్ ల్యాండ్ లో జరిగే స్టార్టప్ ఈవెంట్ కు ఆహ్వానిస్తారు. అక్కడ కూడా విద్యార్థులు తాము రూపొందించిన గేమ్ లను ప్రదర్శించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది.