Pranab Mukherjee: కాంగ్రెస్ ఖేల్ ఖతం.. ప్రణబ్ ముఖర్జీ కూడా ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లారు: ఒవైసీ
- కాంగ్రెస్ తో ప్రణబ్ ది 50 ఏళ్ల అనుబంధం
- కాంగ్రెస్ పై ఎవరైనా నమ్మకం పెట్టుకుంటారా?
- సెక్యులరిజాన్ని మోదీ, బీజేపీలు నాశనం చేస్తున్నాయి
కాంగ్రెస్ పని అయిపోయిందంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆ పార్టీతో 50 ఏళ్ల పాటు అనుబంధాన్ని కలిగి ఉన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో అడుగుపెట్టారని అన్నారు. అలాంటి కాంగ్రెస్ పై ఇంకా ఎవరైనా నమ్మకం పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. గాంధీని హత్య చేసిన సమయంలో ఆరెస్సెస్ సంబరాలు చేసుకుందని... ఆ విషయాన్ని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా తన లేఖలో ప్రస్తావించారని చెప్పారు. ఇప్పుడు ఆరెస్సెస్ కార్యాలయంలో ప్రణబ్ ఉపన్యసిస్తే కొంత మంది శభాష్ అంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో సెక్యులరిజాన్ని మోదీ, బీజేపీలు నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.
భారత్ అంటే హిందువులు, ముస్లింలు, సిక్కులు తదితర మతాల, కులాల, ప్రాంతాల, భాషల సమాహారమని... అదే అసలైన జాతీయవాదమని ఆరెస్సెస్ కార్యాలయంలో ప్రసంగిస్తూ ప్రణబ్ చెప్పారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే ప్రాంతం వంటి భావన మనకు వర్తించదని అన్నారు. అయితే ఆరెస్సెస్ కార్యాలయానికి ప్రణబ్ వెళ్లడం పట్ల కొందరు కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ఆ తర్వాత వెనక్కి తగ్గారు.