Elephant: మేఘాలయలో రెచ్చిపోతున్న ‘లాడెన్’.. 37 మందిని తొక్కి చంపేసిన ఏనుగు!
- జనాలకు కంటి మీద కునుకును దూరం చేస్తున్న ఏనుగు
- దానిని చూస్తే అటవీ అధికారులకూ వణుకే
- కాల్చి చంపేలా ఉత్తర్వుల కోసం ఉన్నతాధికారులకు వేడుకోలు
ప్రజల ప్రాణాలను ఈజీగా తీసేస్తున్న ఈ ఏనుగుకు ఉగ్రవాది లాడెన్ పేరు పెట్టింది అందుకే. ఏకంగా 37 మంది ప్రాణాలను తీసేసింది. మేఘాలయలోని గరోహిల్స్‌లో ఇప్పుడీ లాడెన్ పేరు వింటే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. 2016 నుంచి ఇది హడలెత్తిస్తోంది. అటవీ అధికారులు కూడా భయపడిపోతున్నారు. గ్రామాలు, జనావాసాలపై పడి దాడులు చేసి జనాలను చంపేస్తోంది. అతి భారీ కాయంతో ఉండే దీనిని చూస్తేనే చెమటలు పడుతుంటాయి.
‘లాడెన్’ ఆగడాలు మరీ పెచ్చుమీరడంతో కాల్చి చంపేలా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరినట్టు అధికారులు తెలిపారు. తాజాగా ఈనెల 2న తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అసోంలోని పట్‌పారా పహర్టోలీ గ్రామంలో ఓ గిరిజనుడి ఇంటిపై ఏనుగు దాడి చేసింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని హజోంగ్‌ను తొక్కి చంపేసింది.
సాయంత్రం కాగానే గ్రామాలపై పడడం, అడ్డం వచ్చిన వారిని చంపడాన్ని పనిగా పెట్టుకున్న ఈ లాడెన్‌ను కాల్చి చంపడం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. అందుకే ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు.