Karnataka: కుమారస్వామికి రోజుకో తలనొప్పి.. నచ్చిన శాఖలు రాలేదంటూ మంత్రుల గుస్సా!
- శనివారం శాఖలు కేటాయించిన సీఎం కుమారస్వామి
- ఆర్థిక, విద్యుత్ సహా 11 శాఖలు సీఎం వద్దే
- కాంగ్రెస్ సరికొత్త రాజీ సూత్రం
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి రోజురోజుకి తలనొప్పి ఎక్కువవుతోంది. మంత్రి పదవులు రాలేదని కొందరు, కోరుకున్న శాఖ ఇవ్వలేదని కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శనివారం మంత్రి పదవులు కేటాయించిన సీఎం కీలకమైన ఆర్థిక, విద్యుత్ సహా 11 శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం జి.పరమేశ్వరకు హోంశాఖతోపాటు బెంగళూరు అభివృద్ధి శాఖ, యువజన సర్వీసుల శాఖను కేటాయించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హోం ఒక్కటీ ఆయనకు ఇచ్చి మిగిలిన వాటిని తమకు ఇవ్వాలని పదవులు దక్కనివారు డిమాండ్ చేస్తున్నారు. కుమారస్వామి సోదరుడు హెచ్డీ రేవణ్ణకు ఆయన కోరుకున్నట్టుగానే ప్రజాపనుల శాఖను కేటాయించారు. అయితే, విద్యుత్ శాఖ కూడా తనకు కావాలని ఆయన కోరుతున్నారు. డీకే శివకుమార్‌కు భారీ, మధ్య తరహా నీటి పారుదల, వైద్యవిద్య శాఖలు కేటాయించారు. అయితే, ఆయన మాత్రం తనకు విద్యుత్ శాఖ కావాలని తొలి నుంచీ కోరుతున్నారు.
చాముండేశ్వరిలో మాజీ సీఎం సిద్ధరామయ్యను ఓడించిన జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య శాఖను కేటాయించారు. దీంతో ఆయన గుర్రుగా ఉన్నారు. ఇలా పదవులు దక్కిన వారు, దక్కని వారు కూడా తీవ్ర అసంతృప్తితో రగలిపోతున్నారు. డిప్యూటీ సీఎం పోస్టు కావాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్‌తో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశమై సర్దిచెప్పారు. మంత్రి పదవితో సరిపెట్టుకోవాలని రాహుల్ చెప్పినట్టు సమాచారం. ఇలాగైతే కాదని భావిస్తున్న కాంగ్రెస్.. రొటేషన్ పద్ధతిని తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండేళ్లకు 22 మంది చొప్పున ఐదేళ్లలో మొత్తం 66 మందిని మంత్రులను చేసేలా సరికొత్త రాజీ సూత్రాన్ని ప్రతిపాదించినట్టు సమాచారం.