train derailed: పట్టాలు తప్పిన ముంబై-హౌరా రైలు... పలు రైళ్లు రద్దు... కొన్ని దారి మళ్లింపు
- మహారాష్ట్రలోని ఇగత్ పురి రైల్వే స్టేషన్ సమీపంలో వేకువజామున ప్రమాదం
- పట్టాలు తప్పిన ఎస్12, ఎస్13, ప్యాంట్రీకారు
- ప్రయాణికులు అందరూ క్షేమం
ముంబై-హౌరా మెయిల్ రైలు ఈ రోజు వేకువజామున మహారాష్ట్రలోని ఇగత్ పురి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. ప్రయాణికులు ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. కాకపోతే ఈ ఘటనతో రైల్వే ట్రాక్ దెబ్బతినడం వల్ల ఈ మార్గంలో నడిచే 12 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఏడు రైళ్లను దారి మళ్లించింది.
నాగ్ పూర్ ద్వారా ప్రయాణించే ముంబై-హౌరా మెయిల్ ( రైలు నంబర్ 12809 ) ముంబై డివిజన్ పరిధిలో ఈ వేకువజామున 2.05 గంటల సమయంలో పట్టాలు తప్పిందని సెంట్రల్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సునీల్ ఉదాసి ధ్రువీకరించారు. ప్రయాణకులకు ఎవరికీ గాయాలు కాలేదని ఆయన చెప్పారు. ఎస్12, ఎస్13తో పాటు ప్యాంట్రీ కారు కోచ్ పట్టాలు తప్పిందని తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడిందని, త్వరలోనే మార్గాన్ని పునరుద్ధరిస్తామని రైల్వే శాఖ తెలిపింది.
పూణె-దాండ్-ముంబై మార్గంలో దారి మళ్లించిన రైళ్లు అమృత్ సర్ ఎక్స్ ప్రెస్(11057), గువహటి ఎక్స్ ప్రెస్(15645), వారణాసి ఎక్స్ ప్రెస్ (12167), వారణాసి మహానగరి ఎక్స్ ప్రెస్ (11093), పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ (12141), పాన్వెల్ గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ (15066), ఎల్ టీటీ-హాతియా ఎక్స్ ప్రెస్ (12811). సాయం కోసం పంప్రదించాల్సిన నంబర్లు 0251-2311499, 022-24114836, 02553-244020.