shivsena: 'ప్రధాని హత్యకు కుట్ర' ఉదంతంపై శివసేన వ్యంగ్యం
- పార్టీ పత్రిక సామ్నాలో సంపాదకీయం
- పోలీసులు బయట పెట్టిన లేఖ ఆసక్తికరంగా, ప్రమాదకరంగా ఉందని అభివర్ణన
- బీజేపీపై విమర్శల దాడిని పెంచిన శివసేన
ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారంటూ ఇటీవలే పూణె పోలీసులు ఓ సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకురాగా, శివసేన తన పార్టీ పత్రిక సామ్నాలో దీన్ని విమర్శిస్తూ సంపాదకీయం రాసింది. ‘దేశ ప్రజల ప్రాణాలైతే పోవచ్చు కానీ, ప్రధాని ప్రాణాలు మాత్రం పోరాదు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
మావోయిస్టు సానుభూతి పరుల నుంచి ఓ లేఖ స్వాధీనం చేసుకున్నట్టు, అందులో మరో రాజీవ్ గాంధీ హత్య తరహా ఘటన గురించి ఉందని పోలీసులు కొన్ని రోజుల క్రితం పూణె సెషన్స్ కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ లేఖ ఆసక్తికరంగానూ, ప్రమాదకరంగానూ ఉందని సామ్నాలో శివసేన పేర్కొంది.
ఇటీవలి కాలంలో శివసేన ప్రధానిని, బీజేపీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తూ వస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం అయిన తర్వాత కూడా ఈ వైఖరి మారలేదు. బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్ ను ఆర్ఎస్ఎస్ తెరపైకి తేవచ్చంటూ ఒక్క రోజు ముందే శివసేన పేర్కొంది.