amit shah: ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం చాలా కీలకం.. నా వ్యాఖ్యలను రాహుల్ వ్యక్తిగతంగా తీసుకోరాదు: అమిత్ షా
- కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ బతికించుకోవాలి
- మంచి పనులు చేశాం.. అందుకే ప్రజలు మద్దతు ఇస్తున్నారు
- మన్మోహన్ సింగ్ విదేశాలకు వెళ్తే ఎవరికీ తెలిసేది కాదు
ప్రజాస్వామ్య వ్వవస్థలో ప్రతిపక్ష పార్టీ కీలకమైన పాత్రను పోషిస్తుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 'కాంగ్రెస్ ముఖ్త్ భారత్' అనేది బీజేపీ స్లోగన్ అని... దీని అర్థం దేశం నుంచి కాంగ్రెస్ ను వెళ్లగొట్టాలి అని కాదని, ఆ పార్టీ సంస్కృతిని పోగొట్టాలనేది అర్థమని చెప్పారు. ఇప్పటికే కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని... కాంగ్రెస్ ను ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బతికించుకోవాలని చెప్పారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం ఉండదని అన్నారు. చత్తీస్ ఘడ్ లోని సుర్గుజా జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈమేరకు స్పందించారు.
తన ప్రసంగాల్లో రాహుల్ గాంధీని టార్గెట్ చేయడం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా తీసుకోరాదని చెప్పారు. రాహుల్ తనకు సంధించిన కొన్ని ప్రశ్నలకు తాను సమాధానాలు చెప్పానని తెలిపారు. తాము ఎన్నో మంచి పనులు చేస్తున్నామని... అందుకే బీజేపీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారని చెప్పారు. తమ కుటుంబంలోని నాలుగో తరానికి అధికారాన్ని కట్టబెట్టాలని రాహుల్ అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ లో వారసత్వం గురించి రాహుల్ చెప్పాలని, బీజేపీలో వారసత్వం గురించి తాను చెబుతానని అన్నారు.
మధ్యతరగతి ప్రజలు బీజేపీ వెంటే ఉన్నారని... 14 రాష్ట్రాల్లో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది వారేనని అమిత్ షా చెప్పారు. దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచామని, గత నాలుగేళ్లలో భారీ సంఖ్యలో తీవ్రవాదులను హతమార్చామని తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలకు వెళ్తే ఎవరికీ తెలిసేది కాదని... ఇప్పుడు ప్రధాని మోదీ విదేశాలకు వెళ్తే ఎన్నారైలతో పాటు ఆయా దేశ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని చెప్పారు.