coca cola: కోకా కోలా, మెక్ డొనాల్డ్స్ ఎవరు స్థాపించారు? వారంతా భారతీయులా?: రాహుల్ గాంధీ
- మనకు కూడా ఎన్నో తెలివితేటలు ఉన్నాయి
- కానీ బ్యాంకులు మనకు లోన్లు ఇవ్వడం లేదు
- మోదీ కేవలం పారిశ్రామికవేత్తలకే సాయం చేస్తారు
భారత ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర కథనాన్ని వినిపించారు. ఢిల్లీలో ఓ సభలో ప్రసంగిస్తూ... కోకాకోలా సంస్థను ఎవరు స్థాపించారో తెలుసా? అంటూ ప్రశ్నించారు. అమెరికాలో షికంజీ (నిమ్మరసం) అమ్ముతూ కోకాకోలా సంస్థను దాని యజమాని ప్రారంభించారని చెప్పారు. అమెరికన్ ఫార్మసిస్ట్ జాన్ పెంబర్టన్ 1886లో సోడా కలిపిన ద్రావకాన్ని అమ్మడం ప్రారంభించారని... ఆ తర్వాత అది కోలా డ్రింక్ గా ప్రఖ్యాతిగాంచిందని తెలిపారు. ఆ తర్వాత అతను కనిపెట్టిన డ్రింక్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని చెప్పారు.
1940లో రిచర్డ్, మౌరీస్ మెక్ డొనాల్డ్ లు మెక్ డొనాల్డ్స్ ను స్థాపించారని రాహుల్ తెలిపారు. 1937లో వీరిద్దరూ కాలిఫోర్నియాలో ఒక హాట్ డాగ్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారని, ఆ తర్వాత అది మెక్ డొనాల్డ్స్ గా ప్రఖ్యాతిగాంచిందని చెప్పారు. ఫోర్డ్ కంపెనీని స్థాపించిన ఫోర్డ్ ఒక మెకానిక్ అని తెలిపారు. వీరంతా భారతీయులా? అని ప్రశ్నించారు.
మనకు కూడా ఎన్నో తెలివితేటలు, శక్తి, టాలెంట్ ఉన్నాయని... అయితే, మనకు సహాయం చేయడానికి, లోన్లు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని రాహుల్ విమర్శించారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి సాయం చేయడం లేదని అన్నారు. నరేంద్ర మోదీ కేవలం పారిశ్రామికవేత్తలకే సహకారం అందిస్తున్నారని మండిపడ్డారు. 15 నుంచి 20 మంది పారిశ్రామికవేత్తలకే బీజేపీ సహాయం చేస్తుందని, వారి నుంచి కోట్లాది రూపాయలు బీజేపీకి వస్తాయని దుయ్యబట్టారు. ప్రతిఫలంగా ఆ 15-20 మందికే బెనిఫిట్స్ లభిస్తాయని అన్నారు.