dmart: రూ. 2500 ఫ్రీ ఓచర్ ఇస్తోందంటూ వాట్సాప్ లో ప్రచారం.. అంతా అబద్ధమేనన్న డీమార్ట్
- గత రెండు రోజులుగా వాట్సాప్ లో ప్రచారం
- తాము ఎలాంటి గిఫ్ట్ ఓచర్లు ఇవ్వడం లేదన్న డీమార్ట్
- లింక్ ను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరే అవకాశం ఉందన్న నిపుణులు
ప్రముఖ రీటైల్ సంస్థ డీమార్ట్ తన 17వ వార్షికోత్సవం సందర్భంగా రూ. 2500 షాపింగ్ ఓచర్ ను ఫ్రీగా ఇస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా జరుగుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో దీనికి సంబంధించిన లింక్ బాగా షేర్ అయింది. లింక్ ను క్లిక్ చేయగానే... ఈ విషయాన్ని మరో 20 మందికి షేర్ చేయండనే మెసేజ్ వస్తుంది. మనం 20 మందికి లింక్ ను షేర్ చేయగానే... ఆ తర్వాత స్పందించడం ఆగిపోతుంది. వాట్సాప్ లో ఈ లింక్ ను భారీ సంఖ్యలో షేర్ చేశారు. దీనిపై డీమార్ట్ యాజమాన్యం స్పందించింది. తాము ఎలాంటి గిఫ్ట్ ఓచర్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
మరోవైపు, ఈ లింక్ ను క్లిక్ చేస్తే వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే ఈ లింక్ ను క్లిక్ చేసినవారు తమ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని సూచించారు.