kumaraswamy: అవినీతిపై పోరాడితే.. ముందు నన్ను తప్పిస్తారు: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు
- పూర్తి మెజారిటీ లేకపోవడంతో కఠిన నిర్ణయాలు కష్టమే
- అవినీతి నిర్మూలన అంత సులభం కాదు
- ముల్లును ముల్లుతోనే తీయాలి
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తను కనుక అవినీతిని నిర్మూలించేందుకు నడుం బిగిస్తే తొలుత తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అటువంటి వ్యవస్థే ఉందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బెంగళూరులోని గాంధీభవన్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పాతుకుపోయిన అవినీతిని నిర్మూలించడం అంత తేలికైన విషయం కాదన్నారు.
ప్రభుత్వం తమకేమీ చేయకపోయినా పర్వాలేదు కానీ, సమాజంలోని అవినీతిని రూపుమాపాలని శృంగేరీ పీఠాధిపతి తనకు సూచించినట్టు సీఎం తెలిపారు. అయితే, అది అంత సులభమైన పని కాదన్నారు. ముల్లును ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని ఉపయోగించి అవినీతి నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. అయితే, తనకు పూర్తిస్థాయిలో మెజారిటీ లేనందున కఠిన నిర్ణయాలను తీసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
తాను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో తెలియదని, డబ్బు సంపాదించాలన్న ఆశ, ఆసక్తి కూడా లేవని కుమారస్వామి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తిగా పనిచేసి పేదలకు అండగా నిలుస్తానని వివరించారు.