vivek: టీఆర్ఎస్ నేత వివేక్ కు షాక్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పదవి నుంచి తొలగించిన హైకోర్టు
- సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
- శేషునారాయణ, అజారుద్దీన్ తదితరులు వేసిన పిటిషన్ లో తుది తీర్పు
- మరోసారి పూర్తి స్థాయి విచారణ జరపాలంటూ ఆదేశం
టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారుడు వివేక్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పదవి నుంచి తొలగిస్తూ తీర్పును వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. వివేక్ విషయంలో అంబుడ్స్ మెన్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టం చేసింది. మరోసారి పూర్తి విచారణను చేపట్టాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది. అప్పటి వరకు ప్రెసిడెంట్ పదవిలో వివేక్ కొనసాగరాదని ఆదేశించింది.
గతంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న వివేక్ అవినీతికి పాల్పడుతున్నారంటూ కార్యదర్శి శేషునారాయణ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తదితరులు పిటిషన్ వేశారు. మరోవైపు హెచ్సీఏ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా రెండు పదవులను అనుభవిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్, వివేక్ కు అనుకూలంగా తీర్పును ఇవ్వగా, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇప్పుడు వివేక్ ను అనర్హుడిగా ప్రకటించింది.