paruchuri gopalakrishna: 'సర్పయాగం'లో మీనా చేయాల్సింది .. ఆ ఛాన్స్ రోజాకి దక్కింది: పరుచూరి గోపాలకృష్ణ
- 'సర్పయాగం' ఓ నవలగా రాశాను
- సినిమా చేద్దామన్నారు నాయుడుగారు
- దర్శకుడిగా రంగంలోకి దిగాను
పరుచూరి గోపాలకృష్ణ తన సినీ ప్రయాణంలో విశేషాలను .. 'పరుచూరి పలుకులు'గా అందిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "రోజా అసలు పేరు శ్రీలత .. ఆమె నాకు తారసపడటం చిత్రంగా జరిగింది. నేను 'సర్పయాగం' అనే నవలను రాశాను .. ఆ నవలకి అన్నయ్య ఆర్డర్ వేశాడు. ఆ కథ నచ్చడంతో తాను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతూ నన్ను దర్శకత్వం చేయమన్నారు రామానాయుడు గారు.
ఈ సినిమాలో శోభన్ బాబు కూతురు పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ సమయంలోనే 'సీతారామయ్య గారి మనవరాలు' సూపర్ హిట్ అయింది. అందువలన శోభన్ బాబు కూతురు పాత్రకి 'మీనా' ను తీసుకుందామని నాయుడుగారు అన్నారు. మధ్యలో చనిపోయే అమ్మాయి పాత్ర కావడం వలన .. నాకు కొంచెం సమయం కావాలని అడిగాను. అదే సమయంలో నాకు బాగా సన్నిహితుడైన దర్శకుడు శివప్రసాద్ తాను తెరకెక్కించిన 'ప్రేమ తపస్సు' పాటలు చూపించాడు.
ఆ సినిమాలో కథానాయికగా చేసిన 'రోజా'ను చూడగానే, 'సర్పయాగం' సినిమాకి గాను శోభన్ బాబు కూతురు దొరికేసిందని అనుకున్నాను. రెండు రోజులు షూటింగ్ చేసిన తరువాత కూడా రోజాను పంపించేసి 'మీనా'ను తీసుకోమన్నారు నాయుడుగారు. అలాగైతే డైరెక్టర్ గా నన్ను కూడా తీసేయండి .. లేదంటే నన్ను నమ్మండి" అన్నాను నేను. అలా ఈ సినిమా ద్వారా రోజా ప్రేక్షకుల ముందుకు వచ్చింది" అని ఆయన చెప్పారు.