Andhra Pradesh: ఏపీలో ఏ పార్టీతోనూ మాకు పొత్తులుండవు.. ప్రజలతోనే మా పొత్తు: ఊమెన్ చాందీ
- కాంగ్రెస్ పార్టీకి ఏపీ అనుకూలమైన రాష్ట్రం
- వచ్చే ఎన్నికలను సవాల్ గా తీసుకుని ముందుకెళ్తున్నాం
- మోదీ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని, ప్రజలతోనే తమ పొత్తు అని కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి ఊమెన్ చాందీ స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఊమెన్ చాందీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఏపీ అనుకూలమైన రాష్ట్రమని, బూత్ లెవెల్ వరకు పార్టీ నిర్మాణమే లక్ష్యంగా త్వరలోనే ఇంటింటికి ప్రచారం ప్రారంభించనున్నట్టు చెప్పారు.
త్వరలోనే యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజల్లోకి వెళతామని, వచ్చే ఎన్నికలను సవాల్ గా తీసుకుని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ డెమోక్రటిక్ సెక్యులర్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాలనపై ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.అనంతరం, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఊమెన్ చాందీ ఆదేశాల మేరకు తామంతా ముందుకెళ్తామని, ఎన్నికల కోసం ఒక టీమ్ ను తయారు చేసి క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పార్టీ నిర్మాణం కోసం సీనియర్ లీడర్లను రాహుల్ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.
టార్గెట్ 2019కి ఒక దశదిశ ఇచ్చేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని, ఈ నెల 19న రాహుల్ గాంధీ నలభై ఎనిమిదో జన్మదినం నిర్వహించాలని ఒక తీర్మానం చేశామని చెప్పారు. రాహుల్ ని ప్రధానిగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. కాగా, ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ ఊమెన్ చాందీని ముస్లిం లీగ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బషీర్ అహ్మద్ కోరారు. ఏపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అతిథిగా విచ్చేసిన ఊమెన్ చాందీని ఆ పార్టీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంతో పాటు 2019 సార్వత్రిక ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 5 పార్లమెంట్ సీట్లను కేటాయించాలని కోరారు.