New Delhi: నమ్మిన వాళ్లను మోసం చేయడం చంద్రబాబు నైజమని మోదీకి చెప్పా: కన్నా లక్ష్మీనారాయణ
- చంద్రబాబు యూటర్న్ విషయమై మోదీ నన్ను ప్రశ్నించారు
- బాబుకు అందరి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు
- ఏ రాష్ట్రానికీ చేయనన్ని పనులు ఏపీకి చేశాం
ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ కు ఒప్పుకున్న చంద్రబాబు ఎందుకు యూటర్న్ తీసుకున్నారని ప్రధాని మోదీ తనను అడిగారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర పెద్దలతో ఏపీ బీజేపీ నేతలు వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కన్నా కలిశారు.
ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నమ్మిన వాళ్లను మోసం చేయడం చంద్రబాబు నైజమని మోదీకి చెప్పానని అన్నారు. చంద్రబాబుకు అందరి కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని, ఏ రాష్ట్రానికీ చేయనన్ని పనులు ఏపీకి చేశామని మోదీ అన్నారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నా ఏపీకి కేంద్రం సాయం మాత్రం ఆగలేదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే ఏపీకి ఏమీ చేయడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్నారని, రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మండిపడ్డారు.
ఈ విషయమై మోదీ, అమిత్ షా ఆరా తీశారని, ఏపీకి కేంద్రం చేస్తున్న సాయంపై తమ ప్రణాళికను మోదీకి వివరించామని చెప్పారు. ‘ప్రత్యేక హోదాపై రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప, మరోటి కాదు. ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించిన తర్వాత టీడీపీ సంబరాలు చేసుకోలేదా? ప్యాకేజ్ కు ఒప్పకుంటూ అసెంబ్లీలో తీర్మానం చేయలేదా? ప్యాకేజ్ కు సహకరించిన వెంకయ్యకు సన్మానాలు చేయలేదా? అబద్ధాలాడుతోంది మేమా? మీరా?’ అని కన్నా ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా ఇస్తే ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు కన్నా ఎక్కువ డ్రా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని, ప్యాకేజ్ ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.3600 కోట్లు అందుతాయని అన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు నిజం తెలుసుకున్న రోజున ఏపీలో టీడీపీ కనుమరుగుకావడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు చిత్తశుద్ధితో రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
విభజన హామీలపై మోదీ సానుకూలంగా స్పందించారని, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. రైల్వేజోన్, స్టీల్ ప్లాంట్ సహా ఏ విషయంలోనూ కేంద్రం చేయనన్న మాట చెప్పలేదని కన్నా అన్నారు.