hafeez sayeed: 'ఉగ్ర'నేత హఫీజ్ సయీద్ కు పాకిస్థాన్ లో మరోసారి చుక్కెదురు!
- మిల్లి ముస్లిం లీగ్ కు రాజకీయ పార్టీ హోదా ఇచ్చేందుకు నిరాకరణ
- మరోసారి అదే నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్
- హోం శాఖ అభ్యంతరాల నేపథ్యంలోనే
2008 ముంబై మారణహోమం సూత్రధారి, ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ లో మరోసారి చుక్కెదురైంది. హఫీజ్ సయీద్ కు చెందిన రాజకీయ విభాగం... మిల్లి ముస్లిం లీగ్ (ఎంఎంఎల్)కు రాజకీయ పార్టీ హోదా కల్పించాలన్న దరఖాస్తును అక్కడి ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఎంఎంఎల్ ను రాజకీయ పార్టీగా గుర్తించేందుకు నిరాకరిస్తూ గతేడాది పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. దీంతో నలుగురు సభ్యుల ఎలక్షన్ కమిషన్ ఈ రోజు సమావేశమై చర్చించింది. మరోసారి మిల్లి ముస్లిం లీగ్ కు రాజకీయ పార్టీ హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది.
మిల్లి ముస్లిం లీగ్ కు నిషేధిత జమాత్ ఉద్ దవాతో సంబంధాలు ఉన్నాయన్న హోం శాఖ అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. నిషేధిత జమాత్ ఉద్ దవాకు ఇది మారు రూపమని పేర్కొంటూ, రాజకీయ పార్టీ హోదా ఇవ్వడానికి అక్కడి హోం శాఖ వ్యతిరేకించింది. అయితే, జమాత్ ఉద్ దవాతో తమకు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను ఎంఎంఎల్ ఖండించింది. తమ పార్టీ చీఫ్ సైఫుద్దీన్ ఖలీద్ కు సయీద్ తో సంబంధాలున్నాయని మాత్రం అంగీకరించింది. ఎంఎంఎల్ ను గతేడాది ఆగస్ట్ లో ఏర్పాటు చేశారు. జూలై 25న జరిగే ఎన్నికల కోసం పార్టీ తరఫున హఫీజ్ సయీద్ ఇప్పటికే ప్రచారం చేశారు.