divya suryadevara: మరో అమెరికా దిగ్గజ కంపెనీకి భారతీయ మహిళ నాయకత్వం
- జనరల్ మోటార్స్ సీఎఫ్ వోగా దివ్య సూర్యదేవర నియామకం
- ప్రస్తుతం ఆమె జనరల్ మోటార్స్ కార్పొరేట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్
- చెన్నైలో జన్మించిన దివ్య... మాస్టర్స్ డిగ్రీ వరకూ అక్కడే చదువు
భారతీయ అమెరికన్ మహిళ దివ్య సూర్యదేవర అమెరికా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (సీఎఫ్ వో) గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె కంపెనీ కార్పొరేట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. సెప్టెంబర్ 1 నుంచి సీఎఫ్ వోగా దివ్య బాధ్యతలు చేపడతారని కంపెనీ ప్రకటించింది. 2017 జూలై నుంచి జనరల్ మోటార్స్ కంపెనీలో కార్పొరేట్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న ఆమె కంపెనీ సీఈవో మేరీ బర్రాకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సీఎఫ్ వోగా నియమితులైన సందర్భంగా దివ్యకు మేరీ బర్రా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె అనుభవం కంపెనీ వ్యాపారాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు తోడ్పడుతుందని ట్వీట్ చేశారు.
కంపెనీకి చెందిన కీలకమైన రెండు పదవుల్లో మహిళలే ఉండనుండడం విశేషం. ఎందుకంటే మరే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలోనూ సీఈవో, సీఎఫ్ వో పదవుల్లో మహిళల్లేరు. చెన్నైలో జన్మించిన దివ్య (39) మద్రాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సు చేసేందుకు 22 ఏళ్ల వయసులోనే అమెరికాకు చెక్కేశారు. జనరల్ మోటార్స్ లో 2005లో చేరడానికి ముందు యూబీఎస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లో పనిచేశారు. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ కు సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ కు సుందర్ పిచాయ్ సారధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. వీరు కూడా జన్మత: భారతీయులే!