Kadapa District: కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వబోమని చెబుతోంటే.. జగన్, పవన్ ఎందుకు నీలదీయట్లేదు?: ఏపీసీసీ
- చిత్తశుద్ధి ఉంటే మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి
- మోదీ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది
- చంద్రబాబు ఇకనైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి
- నాలుగేళ్ల పాటు చంద్రబాబు చోద్యం చూశారు
ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు కక్ష పూరితంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ పేర్కొంది. ఈమేరకు ఈరోజు ఏపీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ పేరిట ఓ పత్రికా ప్రకటన విడుదలైంది. "రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టం అమలు చేయకుండా నాటకాలడుతుంటే బీజేపీ ఏపీ నేతలు నిద్రపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నాం. పార్లమెంటు ఆమోదించిన విభజన చట్టంలో కడప జిల్లాలో సమీకృత ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్పష్టంగా పేర్కొన్నారు. మోదీ సర్కారు కావాలనే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కాలయాపన చేస్తోంది.
కడప జిల్లాలో ముడి ఖనిజం నాణ్యత సరిగా లేదని, అనువైన పరిస్థితులు లేవంటూ కుంటి సాకులు చెబుతోంది. తన రాజకీయ కుట్రలకు ఐదు కోట్లమంది ఆంధ్రులను బలి చేస్తోంది. చివరికి కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు అధికారికంగా తెలియపర్చినప్పటికీ.. ఈ నాయకులు అంత చేశాం.. ఇంత చేశాం.. అంటూ మీడియాలో అవాకులు చవాకులు పేలడం హాస్యాస్పదంగా ఉంది. నాడు రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ పార్టీని వీడిన కొంతమంది నాయకులు ఏ ముఖం పెట్టుకుని బీజేపీలో చేరారు? అలాగే, ప్రజాసంకల్ప యాత్ర చేస్తొన్న వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డికి తన సొంత జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సంకల్పం లేకపోవడం విడ్డూరంగా ఉంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనిపై మోదీని ఎందుకు నిలదీయరు? వీరందరికీ నిజంగా రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధి ఉంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కోసం మోదీ ఇంటి ఎదుట ధర్నా చేయాలి. ఇందుకోసం కలసి పోరాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈ దిశగా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమయ్యేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలి.
నాలుగేళ్ల పాటు చోద్యం చూసిన చంద్రబాబు ఇకనైనా ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందించాలి. కేవలం ధర్మపోరాటం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తూ.. రాష్ట్రంలో దీక్షలు చేసినంత మాత్రాన కేంద్రం దిగిరాదన్న సంగతి గుర్తెరగాలి" అని శివాజీ పేర్కొన్నారు.