bjp: బీజేపీ నేతలు చివరకు మాధురీ దీక్షిత్ సహకారం కూడా కోరారు!: నారాయణ ఎద్దేవా

  • రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
  • ఫెడరల్ ఫ్రంట్ ఎన్టీయేకు బీ-ఫ్రంట్
  • తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు

బీజేపీ పతనం ప్రారంభమయిందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి తథ్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. బీజేపీ పతనమవుతుందని చెప్పడానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే అని అన్నారు. పునర్వైభవం కోసం బీజేపీ నేతలు నానా కష్టాలు పడుతున్నారని, చివరకు హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహకారాన్ని కూడా కోరారని ఎద్దేవా చేశారు.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాల్లో శిఖండి పాత్రను పోషిస్తున్నారని నారాయణ దుయ్యబట్టారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ-ఫ్రంట్ లాంటిదని అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని... కేసీఆర్ కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల వద్ద కేసీఆర్ మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని... తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారని విమర్శించారు.  

  • Loading...

More Telugu News