Telangana: 4 లక్షల యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుండగా.. 60 శాతం మాత్రమే డోనర్స్ ద్వారా వస్తోంది: లక్ష్మారెడ్డి
- 100 శాతం రక్తం అందే విధంగా చర్యలు చేపట్టాలి
- రక్తదానం మీద విస్తృతంగా ప్రచారం జరగాలి
- వీలైనన్ని ఎక్కువ రక్తదాన శిబిరాలు పెట్టాలి
- నేను, మా కుటుంబ సభ్యులు రక్తదానం చేస్తున్నాం
అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్పదని, ఎమర్జెన్సీలో ఉన్న వాళ్లకు రక్త దానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చని తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో 'వరల్డ్ బ్లడ్ డోనర్ డే' సందర్భంగా హైదరాబాద్లోని నిజాం కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీని ప్రారంభించిన లక్ష్మారెడ్డి అనంతరం మాట్లాడుతూ... "ఒక మనిషి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.
రక్తదానం వల్ల ఎలాంటి నష్టాలు లేవు. పైగా మరింత ఆరోగ్యంగా తయారవుతారు. 4 లక్షల యూనిట్ల బ్లడ్ అవసరం ఉంటుండగా, 60 శాతం మాత్రమే డోనర్స్ ద్వారా వస్తోంది.
మిగతా 40 శాతం కూడా డోనర్స్ ద్వారా రక్తం అందే విధంగా చర్యలు చేపట్టాలి. రక్తదానం మీద విస్తృతంగా ప్రచారం జరగాలి. వీలైనన్ని ఎక్కువ రక్తదాన శిబిరాలు పెట్టి రక్తదానాన్ని ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరు పుట్టిన రోజు, పెళ్లి రోజు... ఇలా ఎదో ఒక రోజున రక్తదానం చేయాలి. నేను నా ప్రతి పుట్టిన రోజున రక్తదాన శిబిరాలు నిర్వహించి నేను, మా కుటుంబ సభ్యులు రక్తదానం చేస్తున్నాం.
గత 15 ఏళ్లుగా ఈ పద్ధతిని కొనసాగిస్తున్నాను. ప్రజల్లో అవగాహన పెంచి చైతన్య పరచాలి. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లో రక్త హీనత ప్రజల్లో ఎక్కువగా ఉంటోంది. గర్భిణీలు ఎక్కువగా రక్త హీనతతో బాధపడుతున్నారు. గర్భిణీలలో రక్తహీనత నివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. వారికి పౌష్టికాహారం అందిస్తున్నాం. రక్తహీనత ఉన్న గర్భిణీలకు ప్రసవ సమయాల్లో రక్తం అవసరం అవుతుంది.
కేసీఆర్ కిట్స్ పథకం వచ్చాక ప్రసవాలు ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లోనే అవుతున్నాయి. రక్తదానాన్ని ప్రోత్సహిస్తే, ప్రసవ సమయాల్లో తల్లుల మరణాలను తగించవచ్చు. అలాగే, అవయవదానాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్స్ సహా ఐ బ్యాంక్స్ ని పెట్టాం. నిన్ననే సరోజనీ దేవీ ప్రభుత్వ ఐ హాస్పిటల్లో దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో ఐ బ్యాంకుని ప్రారంభించాం. అవయవ దానాల్లో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. రక్తదానం చేద్దాం... ప్రాణాలను కాపాడుదాం" అని అన్నారు.