Rains: దేశాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు.. భారీ ప్రాణ నష్టం
- దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపం
- పదుల సంఖ్యలో మరణాలు
- ఆదుకోవాలని కోరుతున్న ఈశాన్య రాష్ట్రాలు
దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు త్రిపుర, మణిపూర్, మిజోరం వంటి రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. కేరళలోని కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలూకా కట్టిపారలో కొండ చరియలు విరిగిపడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో పదిమంది గల్లంతయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 27కు పెరిగింది.
కేరళలోని కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్గఢ్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఉత్తరప్రదేశ్లో పెనుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య రాష్ట్రాల్లో మరో నలుగురు మృతి చెందారు.
వరదల్లో చిక్కుకున్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు వెంటనే మరిన్ని బలగాలను, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కేంద్రాన్ని కోరారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. మణిపూర్లోనూ ఇటువంటి పరిస్థితే ఉండడంతో రాజధాని ఇంఫాల్ సహా ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.