Atchannaidu: మొత్తానికి ఇన్నాళ్లకు బయటపడింది.. షాతో బుగ్గన భేటీపై అచ్చెన్నాయుడు
- బీజేపీ, వైసీపీలు చంద్రబాబుపై కక్షగట్టాయి
- వైసీపీతో సఖ్యత కుదిరింది కాబట్టే టీడీపీని దూరం పెట్టారు
- మా కృషిని ఏపీ ప్రజలు గుర్తించారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనిగట్టుకుని మరీ అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీని ఒక్క మాటా అనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. ఇటువంటి ప్రతిపక్ష నేత రాష్ట్రానికి అవసరమా? అని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీలు సీఎం చంద్రబాబుపై కక్షగట్టాయని అన్నారు. బీజేపీకి వైసీపీ సిస్టర్ పార్టీ అని ఎద్దేవా చేశారు. నాడు రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు మంత్రి చెప్పారు. తాము పొత్తు పెట్టుకున్న ఉద్దేశాన్ని, హామీ అమలు కోసం చేస్తున్న కృషిని ప్రజలు గుర్తించారని అన్నారు.
పిట్టకథలు, కట్టు కథలతో ఏపీని మోసం చేసేందుకు కేంద్రం ప్రయత్నించడం వల్లే ఎన్డీయే నుంచి తెగదెంపులు చేసుకున్నట్టు వివరించారు. దీనికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించిందన్నారు. వైసీపీతో కేంద్రానికి సఖ్యత కుదిరింది కాబట్టే టీడీపీని బీజేపీ వదులుకుందని అన్నారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నప్పటికీ పట్టుదలతో, స్వయం కృషితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేళ్లలో అన్ని రంగాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని వర్గాలను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. చంద్రబాబుపై బహుశా అందుకే కుట్రలు చేస్తున్నారేమో? అని అనుమానం వ్యక్తం చేశారు.
చేతనైతే సాయం చేయాలి, లేకపోతే కూర్చోవాలి కానీ, కుట్రలు పన్నడం సరికాదన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వారిని నిలదీయాల్సింది పోయి, అమిత్ షాను వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలవడంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇంతకంటే నీచాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులను జగన్ కలవడం కుట్ర కాదా? అని నిలదీశారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న మోత్కుపల్లిని కలిసిన వ్యక్తులను ఏమనాలని ప్రశ్నించారు. నేటితో బీజేపీ-వైసీపీ వేరే కాదని, ఒక్కటే అని తేలిపోయిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.