Telangana: ముఖం చాటేసిన వానలు.. మరో రెండు వారాలు ఎండలే!
- రుతుపవనాల ప్రవేశంతో సాధారణం కంటే అధిక వర్షపాతం
- ఆ వెంటనే మాయమైన వానలు
- రైతులు తొందరపడొద్దంటున్న అధికారులు
రెండు రోజులు మురిపించిన వానలు ముఖం చాటేశాయి. వాతావరణ శాఖ చెబుతున్న దాని ప్రకారం వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురు చూడాల్సిందే. ఈ నెల 8న తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. రెండు రోజుల మురిపెం తర్వాత వాన జాడ లేకుండా పోయింది. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 43.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 100.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 34 శాతం అధికంగా పడ్డాయన్నమాట.
వర్షాలు కురవడంతో మురిసిపోయిన రైతులు విత్తనాలు చల్లుకున్నారు. ఆ తర్వాతి నుంచి వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు వారాలపాటు రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం ప్రకటించింది. దుక్కి దున్ని పొలాన్ని సిద్ధం చేసుకున్న రైతులు సరిపడా వర్షాలు పడిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ విస్తరణ సంచాలకులు రాజిరెడ్డి తెలిపారు.
మరోవైపు మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. గురువారం ఆదిలాబాద్లో అత్యధికంగా 38.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, నల్లగొండల్లో 38, భద్రాచలం, రామగుండంలో 37.6, హన్మకొండలో 36.5, నిజామాబాద్లో 36.3, మహబూబ్నగర్లో 36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.