kachi guda: నిజామాబాద్ మీదుగా కాచిగూడ - కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రారంభం
- కొత్త రైలును జెండా ఊపి ప్రారంభించిన రైల్వే మంత్రి
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
- ఇరవై గ్రామీణ రైల్వేస్టేషన్లలో వైఫై సదుపాయం జాతికి అంకితం
కాచిగూడ నుంచి నిజామాబాద్ మీదుగా కరీంనగర్ కు కొత్త రైలు ప్రారంభమైంది. కాచిగూడ-కరీంనగర్ ప్యాసింజర్ రైలును రైల్వే మంత్రి పీయూష్ గోయల్ జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కవిత, మేయర్ బొంతు రామ్మోహన్, రైల్వే జీఎం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అన్ని రైల్వే స్టేషన్లు, పరిపాలనా భవనాల్లో ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ లైట్లను, కాచిగూడ స్టేషన్ లో 400 కిలో వాట్ల సామర్థ్యం గల సౌరవిద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరవై గ్రామీణ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన వైఫై సదుపాయాన్ని జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డును పీయూష్ గోయల్ ప్రదానం చేశారు.
కాగా, కాచిగూడ నుంచి నిజామాబాద్, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల మీదుగా కరీంనగర్ కు ప్రతిరోజు ఈ రైలు నడుస్తుందని రైల్వే శాఖాధికారులు చెప్పారు. కాచిగూడ- కరీంనగర్ ప్యాసింజర్ రైలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. నిజామాబాద్, మోర్తాడ్, మెట్ పల్లి, కోరుట్ల, మేడిపల్లి, లింగంపేట, జగిత్యాల, నూకపల్లి మల్యాల, పొద్దూరు, గంగాధర, కొత్తపల్లి మీదుగా మధ్యాహ్నం 3.25 గంటలకు కరీంనగర్ చేరుకుంటుంది. తిరిగి కరీంనగర్ నుంచి మధ్యాహ్నం 3.45 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు కాచిగూడ చేరుతుంది.