bengaluru: ఆఫ్ఘనిస్థాన్ ను చిత్తు చేసిన భారత్.. రెండు రోజుల్లోనే ముగిసిన టెస్ట్!
- బెంగళూరు టెస్టులో భారత్ ఘన విజయం
- ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో విజయభేరి
- రెండు ఇన్నింగ్స్ లలోను చేతులెత్తేసిన ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్
బెంగళూరులో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే టెస్టును ముగించింది. ఇన్నింగ్స్ 262 పరుగుల భారీ ఆధిక్యంతో విజయదుందుభి మోగించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ పసికూన ఆఫ్ఘాన్ పై టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగించింది.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 474 పరుగులకు ఆలౌట్ అయింది. మురళీ విజయ్ (105), ధావన్ (107)లు శతకాలతో విరుచుకుపడ్డారు. కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాలు అర్ధ సెంచరీలతో రాణించారు. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన ఆఫ్ఘాన్ బౌలర్ రషీద్ ఖాన్ కేవలం రెండు వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్ మెన్ వచ్చినవారు వచ్చినట్టే పెవిలియన్ చేరారు. 109 పరుగులకే చేతులెత్తేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 4, ఇషాంత్ శర్మ, జడేజాలు చెరో రెండు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. అనంతరం ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘాన్ జట్టు... రెండో ఇన్నింగ్స్ లో సైతం భారత బౌలర్లకు మోకరిల్లింది. 103 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ లో జడేజా సత్తా చాటి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్ 3, ఇషాంత్ శర్మ 2, అశ్విన్ ఒక వికెట్ తీశారు. దీంతో, అంతర్జాతీయ క్రికెట్ లో తన టెస్ట్ కెరీర్ ను ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఓటమితో ప్రారంభించినట్టైంది.