paritala sriram: నేను నిజంగా తప్పులు చేసి ఉంటే చంద్రబాబునాయుడు కఠినంగా శిక్షించే వారు: పరిటాల శ్రీరామ్
- విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు
- ఆ ఆరోపణలు నిరూపించండి
- నన్ను ఒక భూతంగా చూపించేందుకు యత్నిస్తున్నారు
ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో పది క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని, ఆయన వర్గీయులు విచ్చల విడిగా నేరాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను పదిమంది హత్యకు కుట్రపన్నానని విజయసాయిరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఈ ఆరోపణలను విజయసాయిరెడ్డి నిరూపించాలి. చమన్ నా చిన్నాన్న లాంటి వారు. కష్టాల్లో నష్టాల్లో మేమందరం కలిసి పనిచేశాం. ఆయన్ని మా కుటుంబమే చంపిందని అనడం చాలా బాధాకరం. నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలి. ఏదో పిచ్చిగా మాట్లాడటం తగదు. నాపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు.
నాపై రాజకీయంగా కుట్ర జరుగుతోంది. నేను రాజకీయాల్లోకి వస్తే నష్టం జరిగిపోతుందనే ఉద్దేశంతోనే, ఒక దుష్ప్రచారం చేసేందుకు చూస్తున్నారు. శ్రీరామ్ అనే వ్యక్తిని ఒక భూతంగా చూపించేందుకు యత్నిస్తున్నారు. ఎవరెవరి మధ్యో జరిగిన గొడవలను నాకు ఆపాదించడం కరెక్టు కాదు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈ పార్టీలో నాయకులు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. నేను నిజంగా తప్పులు చేసి ఉంటే చంద్రబాబునాయుడు గారు నన్ను ఉపేక్షించే వారు కాదు.. నన్ను కఠినంగా శిక్షించేవారు’ అని చెప్పుకొచ్చారు.