Jammu And Kashmir: రంజాన్ ప్రార్థనల తర్వాత రెచ్చిపోయిన కశ్మీరీ యువత... రాళ్లతో దాడులు
- పలు ప్రాంతాల్లో ఆందోళనలు
- పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు
- ఒకరి మృతి, పలువురికి గాయాలు
రంజాన్ పర్వదినం రోజున కశ్మీర్లో యువత రెచ్చిపోయింది. జమ్మూతోపాటు కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో రంజాన్ ప్రార్థనల అనంతరం ఆగ్రహంతో ఉన్న యువత రాళ్లతో భద్రతా బలగాలపై దాడికి దిగింది. దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ను ప్రయోగించాయి.
ఈ నేపథ్యంలో అనంతనాగ్ జిల్లాలోని బ్రాక్ పోరా ప్రాంత వాసి షీరజ్ అహ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం ప్రార్థనల తర్వాత 6.45 గంటల సమయంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలతో భద్రత కోసం మోహరించి ఉన్న జవాన్లపై రాళ్లతో దాడికి దిగారు. పోలీసులు పెల్లెట్లను ప్రయోగించడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. సోఫియాన్ పట్టణంలోనూ ఆందోళనకారులు రాళ్లతో విరుచుకుపడ్డారు. శ్రీనగర్ పట్టణంలోని ఈద్గా ప్రాంతంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. అయితే, బారాముల్లా, సోపోర్, బద్గామ్, కుప్వారా, గండెర్బల్ ప్రాంతాల్లో ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి.