Japan: 25 మిలియన్ల మెక్సికన్లను మీ దేశానికి పంపిస్తాను జాగ్రత్త!: జపాన్ ప్రధానికి ట్రంప్ బెదిరింపు
- ఇటీవల జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడిన ట్రంప్
- జపాన్ ప్రధాని షింజో అబేకు హెచ్చరిక
- కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కూడా ట్రంప్ ఫైర్
ఇటీవల జీ7 దేశాల శిఖరాగ్ర సమావేశంలో రూపొందించిన నివేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆ సమావేశంలో సుమారు 25 మిలియన్ల మెక్సికన్లను జపాన్‌కు పంపిస్తానని ఆ దేశ ప్రధాని షింజో అబేను ట్రంప్ బెదిరించినట్లు తాజాగా తెలిసింది. అలాగే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై కూడా ట్రంప్ ఫైర్ అయ్యారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం.. ఆ సమావేశంలో వలసదారుల విషయంపై అగ్రనేతలు చర్చించారు.
ఈ సందర్భంగా యూరప్‌కు వలస అనేది పెద్ద సమస్యగా మారిందని ట్రంప్ అన్నారు. అనంతరం షింజో అబేను ఉద్దేశించి మాట్లాడుతూ, జపాన్‌కి ఇలాంటి సమస్య లేదని, కానీ తాను 25 మిలియన్ల మెక్సికన్లను పంపిస్తానని, దీంతో ఆయన పదవి నుంచి దిగిపోతారని ట్రంప్ అనడంతో ఆ సమావేశంలో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. ఆ తరువాత వలసలపై చర్చలు ఆపేసి, ఉగ్రవాదం అంశంపై చర్చలు జరిపారు.