Arvind Kejriwal: కేజ్రీవాల్ వద్దకు బయలుదేరిన.. సీఎంలు చంద్రబాబు, మమత, పినరయి, కుమారస్వామి.. హైడ్రామా
- ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు
- ముగ్గురు సీఎంలతో భేటీ
- ఆప్ ఎమ్మెల్యేలు, కేజ్రీవాల్ సతీమణితో కాసేపట్లో భేటీ
ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చర్చించారు. అనంతరం వారంతా కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వద్దకు బయలుదేరారు. కేజ్రీవాల్ ప్రస్తుతం తమ లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తీరుకి నిరసన ధర్నాలో పాల్గొంటోన్న విషయం తెలిసిందే.
అంతకు ముందు, సదరు నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కి ఓ లేఖ రాసి అపాయింట్మెంట్ కోరారు. కేజ్రీవాల్ చేస్తోన్న ఆందోళన గురించి తాము చర్చించాలనుకుంటున్నట్లు వారు తెలిపారు. కాగా, కేజ్రీవాల్‌ను కలిసే ముందు ఆయన సతీమణితో పాటు ఆప్ ఎమ్మెల్యేలను సదరు నలుగురు సీఎంలు కలవనున్నట్లు తెలిసింది.
కొన్ని రోజులుగా ఎల్జీ కార్యాలయంలోనే నిరసన ధర్నా కొనసాగిస్తున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు నలుగురు మంత్రులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లాలని ఈరోజు సాయంత్రం మమత.. ఎల్జీ కార్యాలయాన్ని అనుమతి కోరారు. అధికారులు మమతకు అనుమతి నిరాకరించిన కారణంగానే నలుగురు సీఎంలు కలిసి ఎల్జీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. నలుగురు సీఎంలను తనను కలవనివ్వకుండా కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటోందని కేజ్రీవాల్ మండిపడ్డారు.