Bihar: గ్యాంగ్‌రేప్ బాధిత బాలికతో ఫొటోలు, వీడియోలు.. ఆర్జేడీ అగ్రనేతలపై కేసు నమోదు
- ఈ నెల 14న గయ జిల్లాలో దారుణం
- పోలీసు వాహనం నుంచి బాలికను కిందకు దించిన నేతలు
- ఎలా జరిగిందో, ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) జాతీయ కార్యదర్శి అలోక్ కుమార్ మెహతా, ఎమ్మెల్యే సురేంద్ర యాదవ్ సహా పార్టీలోని పలువురు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్ బాధిత బాలికను బలవంతంగా పోలీసు వాహనం నుంచి దించి ఆ బాధాకర అనుభవం గురించి చెప్పాలని బలవంతం చేశారు.
అంతేకాక, ఆమెతో కలిసి సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. బాధిత బాలిక పేరు, వివరాలు, ఫొటో బయటపెట్టడం చట్ట విరుద్ధం కావడంతో వారిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆర్జేడీ నేతలు తమ ఫోన్లలో బాలికతో ఫొటోలు తీసుకోవడం టీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తోంది. శుక్రవారం ఈ ఘటన జరిగింది.
వైద్య పరీక్షల కోసం బాలికను ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అడ్డుకున్న ఆర్జేడీ నిజ నిర్ధారణ బృందం బాలికను బలవంతంగా కిందికి దించి వివరాలు అడిగింది. అక్కడితో ఆగక నేతలు ఆమెతో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. బాధిత బాలిక ఐడెంటిటీని బహిరంగ పరిచినందుకు గాను వారిపై కేసులు నమోదు చేసినట్టు మగధ రేంజ్ డీఐజీ వినయ్ కుమార్ తెలిపారు. ఆర్జేడీ నిజనిర్ధారణ కమిటీకి లాలు ప్రసాద్ తనయుడు, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ నేతృత్వం వహిస్తున్నారు.
జూన్ 14న సాయుధ యువకులు కొందరు గయ జిల్లాలో బాలిక తండ్రిని చెట్టుకు కట్టేసి, అతని ఎదుటే భార్య, బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనమైంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌పై పోలీసు ఉన్నతాధికారులు వేటేశారు. 20 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.