Narendra Modi: బీజేపీతో కటీఫ్ తరువాత తొలిసారి... మోదీకి ఎదురు పడనున్న చంద్రబాబు!
- నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం
- ముఖాముఖి కలవనున్న నరేంద్ర మోదీ, చంద్రబాబు
- చంద్రబాబు ప్రసంగంపై అందరి దృష్టి
- 2022 అభివృద్ధి ప్రణాళికను ముందుంచనున్న మోదీ
నేడు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం న్యూఢిల్లీలో జరగనుండగా, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ సమావేశానికి హాజరు కానున్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తరువాత, తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ సమావేశంలో ముఖాముఖి కలవనుండటం గమనార్హం.
ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న చంద్రబాబు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను నెరవేర్చాలని పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్యం అంతరిస్తోందని గత రాత్రి కేజ్రీవాల్ దీక్షను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, మిగతా బీజేపీయేతర సీఎంలతో కలసి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బహిష్కరించాలన్న యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తన ప్రసంగంలో మోదీని నిలదీస్తానని ఎంపీలతో చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
ఇక ఈ సమావేశంలో 2022 లోగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై నరేంద్ర మోదీ ప్రసంగించి, ఆ ప్రణాళికను నీతి ఆయోగ్ పాలక మండలితో ఆమోదింప చేసుకోవాలని భావిస్తున్నారు. నీతి ఆయోగ్ నాలుగో గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కోసం తాను ఆతృతగా ఎదురు చూస్తున్నానని, కీలకమైన పాలసీలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నామని నరేంద్ర మోదీ, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. రైతులకు రెట్టింపు ఆదాయం, ఆయుష్మాన్ భారత్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు తదితరాలపై మోదీ మాట్లాడతారని తెలుస్తోంది.