USA: అప్రూవర్లుగా మారిన తెలుగు హీరోయిన్లపై వ్యభిచారం, అనైతికత కింద అభియోగాలు నమోదు చేసిన అమెరికా పోలీసులు!
- చార్జ్ షీట్ లో ఐదుగురి పేర్లు
- పబ్లిక్ కాపీలో ఏ, బీ, సీ, డీ, ఈ అంటూ ప్రస్తావన
- అందరిపైనా అభియోగాలు దాఖలు
అమెరికాలోని చికాగో కేంద్రంగా మోదుగమూడి కిషన్, ఆయన భార్య చంద్రకళ సాగించిన సెక్స్ రాకెట్ లో భాగమైన తెలుగు హీరోయిన్లపై వ్యభిచారం, అనైతికత కింద అమెరికా పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. వారు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ లు పంపిన ఆహ్వానాలు, వీసా సిఫార్సులతో అమెరికాలో కాలు పెట్టినందున ఆ అసోసియేషన్ లపైనా కేసులు పెట్టారు. మొత్తం ఐదుగురు టాలీవుడ్, శాండల్ వుడ్ కు చెందిన హీరోయిన్లు, టీవీ యాంకర్ కిషన్ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి, పెన్సిల్వేనియా, చికాగో తదితర ప్రాంతాల్లోని హోటళ్లలో ఉండి వ్యభిచారం చేశారని చెబుతూ, వారి పేర్లను న్యాయమూర్తికి ఇచ్చిన పోలీసులు, పబ్లిక్ కాపీలో మాత్రం ఏ, బీ, సీ, డీ, ఈ అంటూ ప్రస్తావించారు.
తాను అమెరికా నుంచి వెళ్లాలంటే, కిషన్ భార్య చంద్రకళ మాత్రమే అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని, తనను కొందరు విటులు బెదిరించినట్టు పెన్సిల్వేనియాలో డ్యాన్స్ షో పేరిట అమెరికాకు వచ్చిన ఓ నటి తమకిచ్చిన వాంగ్మూలంలో వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. 'వితవుట్ కమిట్ మెంట్'తో వచ్చిన హీరోయిన్లను ఒత్తిడి, ప్రలోభాలకు గురిచేసి, వారితో వ్యభిచారం చేయించారని కిషన్ దంపతులపై వేసిన చార్జ్ షీట్ లో ప్రస్తావించారు. ఈ కేసును విచారించిన హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ విభాగానికి చెందిన బ్రియాన్ జిన్ అనే స్పెషల్ ఏజెంట్, ఇల్లినాయిస్ జిల్లా కోర్టుకు ఈ సమాచారమంతా అందించారు.