Bonda Uma: ఎమ్మెల్యే బోండా ఉమ పనితీరుపై ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ సర్వే ఏమందంటే...!
- ఉమ పనితీరుపై 70 శాతం మంది సంతృప్తి
- చంద్రబాబు పనితీరు కంటే ఉమాదే బాగుందన్న ప్రజలు
- నిత్యం ప్రజలకు టచ్లో ఉండడమే కారణం!
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఆయన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆయన మళ్లీ గెలుస్తారా? అన్న ప్రశ్నలకు లగడపాటి రాజగోపాల్ ఆర్జీస్ ఫ్లాష్ టీమ్ సర్వేలో బోండాకు బాగానే ఓట్లు పడ్డాయి. ఆయన పనితీరుపై నియోజకవర్గ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే బోండాకే ఎక్కువ మంది మద్దతు పలకడం విశేషం.
చంద్రబాబు పాలనపై 66.56 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, బోండా పనితీరుపై 69.47 శాతం సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. చంద్రబాబు పాలన బాగాలేదన్న వారు 33.44 శాతం కాగా, ఉమ పనితీరు బాగాలేదని 30.53 శాతం మంది చెప్పారు.
గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పూనూరు గౌతంరెడ్డిపై 27 వేల ఓట్ల మెజారిటీతో బోండా ఉమ గెలుపొందారు. గత నాలుగేళ్లలో ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. అనవసర వ్యవహారాల్లో తలదూర్చి వివాదాల్లో ఇరుక్కున్నారు. అయినప్పటికీ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా ఎమ్మెల్యేగా పేరు సంపాదించుకున్నారు. పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి కోసం ఆర్జీస్ ఫ్లాష్ టీం ఈ సర్వే నిర్వహించింది.