LGBT: మా గోడు వినేదెవరు?: హైదరాబాద్ లో సమావేశమైన 200 మంది స్వలింగ సంపర్కులు!
- సమాజంలో గౌరవం దక్కడం లేదు
- హక్కులు కాపాడాలని స్వలింగ సంపర్కుల డిమాండ్
- లామ్ కాన్ లో సమావేశం
సమాజంలో తమను ఏ మాత్రం గౌరవించడం లేదని, తమ హక్కులను కాపాడాలని స్వలింగ సంపర్కులు గొంతెత్తారు. హైదరాబాద్, బంజారాహిల్స్ లోని లామకాన్ లో ఎల్జీబీటీ (లెస్బియన్స్, ట్రాన్స్ జెండర్స్, గే, బై సెక్సువల్) సభ్యులు 200 మంది సమావేశమయ్యారు. తాము ఎదుర్కొంటున్న బాధలను ఏకరువు పెట్టారు.
ప్రతి సంవత్సరం జూన్ ను స్వలింగ సంపర్కుల హక్కుల పోరాట మాసాన్ని నిర్వహిస్తుండగా, దానిలో భాగంగా ఈ సమావేశం జరిగింది. కాలేజీల్లో తమను సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని ఓ యువకుడు, తాను 'గే'నని తెలుసుకుని వారం రోజుల పాటు గదిలో బంధించి అన్నం కూడా పెట్టలేదని మరో యువకుడు తమ అనుభవాలు పంచుకున్నారు. తన శరీరంలో వస్తున్న మార్పులు చూసిన తన తండ్రి దారుణంగా కొట్టి తరిమేశాడని మరో యువకుడు వాపోయాడు. ఏ పాపమూ చేయకుండానే తాము రోడ్డున పడాల్సి వచ్చిందని, తమకు గుర్తింపు కావాలని ఎల్జీబీటీ నేతలు డిమాండ్ చేశారు.