roja: జనసేన పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే రోజా
- కేంద్రాన్ని నిలదీస్తానన్న చంద్రబాబు.. ఢిల్లీలో తోక ముడిచారు
- జనసేనలోకి వెళ్తున్నానంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు
- ఆ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం నాకు లేదు
ఢిల్లీలో నిన్న జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చాలా చనువుగా మెలిగారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ఎలా తాకట్టు పెడుతున్నారనే విషయం నిన్న మరోసారి రుజువైందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తానంటూ అమరావతిలో బీరాలు పలికిన చంద్రబాబు... ఢిల్లీకి వెళ్లి, తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ముసిముసిగా నవ్వుతూ మోదీ, వెకిలిగా నవ్వుతూ చంద్రబాబులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాటకాలను ఏపీ ప్రజలంతా చూస్తున్నారని... 2019 ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. శ్రీకాళహస్తిలో మీడియాతో మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను జనసేన పార్టీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని... చీప్ పబ్లిసిటీ కోసం టీడీపీ నేతలు ఇలాంటి వార్తలను వ్యాపింపజేస్తున్నారని ఈ సందర్భంగా రోజా మండిపడ్డారు. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్ కు రాజమండ్రి ప్రజలు ఘన స్వాగతం పలికారని... జగన్ కోసం ప్రజలు ఎంతగా నిరీక్షిస్తున్నారో ఇది ఒక నిదర్శనమని చెప్పారు. టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు.