film fare: నాకొచ్చిన ఫిల్మ్‌ఫేర్ అవార్డును వేలం వేస్తాను: ‘అర్జున్ రెడ్డి’ హీరో ప్రకటన
- నా తొలి అవార్డు డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తా
- ట్విట్టర్లో సాయం కోరితే మంత్రి కేటీఆర్ స్పందిస్తారు
- సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుంటారు.
'పెళ్లి చూపులు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయన నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. అగ్ర హీరోలతో పోటీ పడి మరీ ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు.
తాజాగా, విజయ్ దేవరకొండ ఈ విషయంపై ట్వీట్ చేస్తూ... తన తొలి అవార్డును వేలంలో అమ్మదలచుకున్నానని చెప్పారు. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇస్తానని అన్నారు. ఎవరైనా సాయం కోరితే మంత్రి కేటీఆర్.. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తుండడాన్ని తాను రోజూ ట్విట్టర్ లో చూస్తున్నానని, అందుకే వేలం ద్వారా వచ్చిన డబ్బును ఆ ఫండ్ కు ఇస్తానని చెప్పారు. ఆ అవార్డు తన ఇంట్లో ఉండడం కంటే తాను పుట్టిన నగరానికి ఉపయోగపడితే బాగుంటుందని పేర్కొన్నాడు.
ఆయన ట్వీట్‌పై కేటీఆర్ హర్షం చేశారు. తొలి ఫిల్మ్‌ఫేర్ సాధించినందుకు అభినందనలు తెలుపుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆయన సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉందని, ఆయన చొరవను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదామని అన్నారు.