Chandrababu: పనితీరు సరిగా లేని రేషన్ డీలర్లను హెచ్చరించిన చంద్రబాబు
- పనితీరు 70 శాతం కన్నా తక్కువ సంతృప్తిగా ఉంటే విచారణ
- ఏ వినియోగదారుడి నుంచీ రేషన్ అందలేదనే ఫిర్యాదు రాకూడదు
- అవసరమైతే వినియోగదారుల ఇంటికెళ్లి మరీ రేషన్ అందివ్వాలి
ఏపీలో పనితీరు సరిగా లేని రేషన్ డీలర్లను సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ, రేషన్ డీలర్ల పని తీరుకు సంబంధించి డబ్భై శాతం కన్నా తక్కువ ప్రజా సంతృప్తి సాధించే వారిపై విచారణ చేపడతామని అన్నారు.
తమకు రేషన్ అందలేదనే ఫిర్యాదు ఏ ఒక్క వినియోగదారుడి నుంచీ రాకూడదని, అవసరమైతే వినియోగదారుల ఇంటికెళ్లి మరీ రేషన్ అందివ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్లకు పలు సూచనలు కూడా చేశారు. పౌరసరఫరాల సేవలపై తొంభై శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు చెప్పారు.