Pawan Kalyan: అత్యాచారానికి ఒడిగట్టే మానవ మృగాలని బహిరంగంగా శిక్షించాలి: పవన్ కల్యాణ్
- నిర్మల్ జిల్లాలో బాలికను రేప్ చేసి హతమార్చడం దారుణం
- ఈ విషయం తెలియగానే నా హృదయం ద్రవించిపోయింది
- ఆడబిడ్డల జోలికొస్తే కఠినంగా శిక్షించేలా చట్ట సవరణలు చేయాలి
అన్నెం పున్నెం ఎరుగని బాలికలు, యువతులపై అత్యాచారానికి ఒడిగట్టే మానవ మృగాలని బహిరంగంగా శిక్షించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా సోన్ లో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై హతమార్చిన ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
పదేళ్ల బాలికపై ముప్పై సంవత్సరాల వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడనే విషయం తెలియగానే తన హృదయం ద్రవించిపోయిందని అన్నారు. కశ్మీర్ లోని కథువా, గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రాంతాలలో బాలికలపై చోటుచేసుకున్న అత్యాచార ఘటనల చేదు జ్ఞాపకాలు సమాజంలో పచ్చిగానే ఉన్నాయని, ఇప్పుడు సోన్ లో చోటుచేసుకున్న దురాగతం గురించి వినడం తనకు ఎంతో బాధ కలిగించిందని అన్నారు.
పోక్సో చట్టం అమలులో లోపాలు లేకుండా చూడటంతోపాటు ఆడబిడ్డల జోలికి వస్తే కఠినంగా శిక్షించేలా చట్టంలో సవరణలు చేయాలని కోరారు. బహిరంగంగా శిక్షిస్తేనే పశువాంఛ కలిగిన వారిలో భయం పుడుతుందని, దోషిని కఠినంగా శిక్షించి బాధిత బాలిక కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.