Andhra Pradesh: ఏపీలో చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి గ్రామసభలు: ఏపీ మంత్రి కేఈ
- ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకూ గ్రామసభలు
- చుక్కల భూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తాం
- తహసీల్దార్, ఉప తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు
రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందుకోసం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వ తేదీ వరకూ 16 రోజుల పాటు గ్రామ సభల ద్వారా ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నామని, ఈ గ్రామ సభల్లో చుక్కల భూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామని అన్నారు.
ఈ నేపథ్యంలో తహసీల్దార్, ఉప తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. రెవెన్యూ సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తమదేనని, చుక్కల భూముల సమస్యల కారణంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం చుక్కల భూముల సమస్యలు పరిష్కారించాలని నిర్ణయించిందని, ఇందుకోసం రెవెన్యూ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుందని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తారని, తహసీల్దార్, ఉప తహసీల్దార్, సర్వేయర్, వి.ఆర్.ఓ., వి.ఆర్.ఏ.,తో పాటు దేవాదాయ, అటవీ, జలవనరుల శాఖ, వక్ఫ్ బోర్డు అధికారులతో కలిపిన బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ గ్రామసభల ద్వారా రైతులను అర్జీలు స్వీకరిస్తామని, ఇంతకుముందు చుక్కల భూముల సమస్య పరిష్కారానికి దరఖాస్తులు ఇవ్వని వారు గ్రామ సభల్లో అందజేయవచ్చని, ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా రాష్ట్రంలో మిగిలిన 9 జిల్లాల్లో 24,17,707 ఎకరాల 64 సెంట్ల చుక్కల భూమి ఉందని పేర్కొన్నారు.
చుక్కల భూములకు చెందిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తారని, పెండింగ్ లో ఉన్న 22-ఎ చుక్కల భూముల సమస్యలకు ఆధారాలు చూపితే అక్కడికక్కడే అధికారులు పరిష్కారం చూపుతారని, గ్రామ సభల నిర్వహణపై చాటింపు వేయాలని రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామ సభల సమయంలో ఆయా గ్రామాల రెవెన్యూ మ్యాప్స్ ను, ఆర్.ఎస్.ఆర్, అండగల్, 1 బి కాపీలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, సెక్షన్ 22 ఏ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ చట్టాల ద్వారా నిషేధించబడిన భూములు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భూములు, దేవదాయ, వక్ఫ్ భూములు, సీలింగ్ భూములు, ప్రభుత్వ ఆసక్తి కలిగిన భూములను నిషేధిత భూముల జాబితాగా విభజించినట్టు తెలిపారు.
క్షురకుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం
దుర్గగుడి క్షురకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేఈ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తామని, ఒక్కో తల నీలాలు తీసేందుకు రూ.13 నుంచి రూ.25 పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దీని ద్వారా వారి ఆదాయం రూ.15 వేలకు పైగా వచ్చే అవకాశం ఉందని, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా క్షురకులు తమ సమ్మె విరమించాలని కోరారు. హోంగార్డులు, వి.ఆర్.ఏలకు జీతాలు పెంచామని, వాళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఉండడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. క్షురకుల జీతాలు పెంపుదల అంశం ఆయా దేవాలయాల బడ్జెట్లపై ఆధారపడి ఉంటుందని, దీన్ని క్షురకులు గుర్తించాలని కోరారు.