Andhra Pradesh: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు... 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు
- అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు
- రేపటి నుంచి ఈ నెల 21 వరకు సెలవులు
- ప్రైవేట్ స్కూళ్లు తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు
ఆంధ్రప్రదేశ్‌లో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మూడు రోజుల పాటు అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ఈ నెల 21 వరకు సెలవులు ఇస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు ప్రకటించారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నామని చెప్పారు.
మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈరోజు కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వాతావరణ శాఖ సూచనలు, హెచ్చరింపుల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నామని మంత్రి గంటా తెలిపారు. తప్పనిసరిగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు కూడా విద్యార్థులకు సెలవులు ఇవ్వాల్సిందేనన్నారు. సెలవుల్లో ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.