Andhra Pradesh: వర్షాకాలంలో ఎండ మంటలు... ఏపీలో విపత్కర పరిస్థితికి కారణం ఏమిటంటే..!
- తొలకరి పలకరించినా తగ్గని ఎండ
- రుతుపవనాల విస్తరణ లేకపోవడమే కారణం
- సముద్రంలో అల్పపీడనాల కొరత కూడా
వర్షాకాలం మొదలైంది. తొలకరి జల్లులూ కురిశాయి. రైతులంతా పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ మండే వేసవిని తలపించేలా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు కాస్తున్నాయి. వానలు కురిసినా ఎండ మంటల ప్రభావం విపరీతంగా వుంది. అందుకే, ఇంత ఎండ పిల్లలకు ప్రమాదకరమని భావించిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించాలన్న నిర్ణయం తీసుకుంది. విశాఖలో అయితే 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక రెంటచింతల, గుంటూరు, విజయవాడ, తిరుపతి, అనంతపురం, కర్నూలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగానే వేడి నమోదవుతోంది.
నైరుతి రుతుపవనాల విస్తరణ సక్రమంగా లేకపోవడంతో ఉష్ణోగ్రత అధికంగా వుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్లే విపత్కర వాతావరణ పరిస్థితి ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. సాధారణంగా ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడతాయని, వాటి ప్రభావంతో ఆకాశం మేఘావృతమై, సూర్య కిరణాల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుందని, ఈ సంవత్సరం అలా జరగలేదని అంటున్నారు. తొలకరి జల్లులు కురిసిన తరువాత గత ఐదు రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉందని, వడగాలులు కూడా వీస్తున్నాయని తెలిపారు. ప్రజలు మరో వారం రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.