ali: ఈ సినిమా ఆడుతుందా అనుకున్నాం .. సూపర్ హిట్ అయింది!: అలీ
- ఈవీవీ గారు మాతో లేడీ గెటప్స్ వేయించారు
- ఏంట్రా బాబూ ఈ గోల అనుకున్నాం
- ప్రతి ఆర్టిస్ట్ కి పదివేలు ఇచ్చారు
కమెడియన్ గాను .. హాస్య కథానాయకుడిగాను అలీ ప్రేక్షకుల మనసులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఓ ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "జంబ లకిడి పంబ' సినిమాలో ఈవీవీ సత్యనారాయణగారు మాతో లేడీ గెటప్స్ వేయిస్తుంటే ఈ గోలేంట్రా బాబూ అనుకునేవాళ్లం. షూటింగులో వున్న వాళ్లంతా హాస్య నటీనటులే కావడంతో గోలగోలగా ఉండేది. సర్కస్ లో రింగ్ మాస్టర్ లా వ్యవహరిస్తూ ఈవీవీ గారు మాతో ఆ సినిమా చేయించారు.
సినిమా డబ్బింగ్ చెప్పేశాము .. చెన్నైలో ఒక షో వేశారు .. ఏంటి ఈ సినిమా విచిత్రంగా వుంది .. ఆడుతుందా? అనుకున్నాం. సినిమా రిలీజ్ అయిన తరువాత సూపర్ హిట్ అయింది .. మేమందరం ఆశ్చర్యపోయాం. చెన్నైలో 100 రోజుల ఫంక్షన్లో ఈవీవీ గారు మాట్లాడుతూ .. ఆర్టిస్టులు తమ పాత్రలకు న్యాయం చేయడం వల్లనే ఈ సినిమా ఈ స్థాయిలో ఆడిందని మెచ్చుకున్నారు. అవార్డుతో పాటు ఆయన సొంత డబ్బులో నుంచి ప్రతి ఆర్టిస్ట్ కి పదివేల రూపాయల చొప్పున ఇచ్చారు" అని చెప్పుకొచ్చారు.