srinivas reddy: 'ఇష్టం'తో కెరియర్ మొదలైంది .. 'ఇడియట్'తో బ్రేక్ వచ్చింది: కమెడియన్ శ్రీనివాస రెడ్డి
- ఆర్టిస్టును కావాలని అనుకోలేదు
- ఆ దిశగా ఫ్రెండ్స్ ప్రోత్సహించారు
- దాంతో హైదరాబాద్ వచ్చాను
తెలుగు తెరపై నవ్వుల సందడి చేసే హాస్యనటుల్లో శ్రీనివాస రెడ్డి ఒకరు. తనదైన డైలాగ్ డెలివరీతో .. బాడీ లాంగ్వేజ్ తో ఆయన ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటారు. అలాంటి శ్రీనివాసరెడ్డి తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను సినిమాల్లోకి వచ్చిన తీరును గురించి ప్రస్తావించారు.
"ఆర్టిస్టును కావాలని నేను అనుకోలేదు .. నాలో ఆ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి హైదరాబాద్ వెళ్లమని ఫ్రెండ్స్ ప్రోత్సహించారు. దాంతో హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ ప్రయత్నాలు మొదలెట్టాను. దూరదర్శన్ సీరియల్లో వెంటనే ఛాన్స్ వచ్చింది. ఇక అలాగే అవకాశాలు వస్తాయని అనుకున్నాను .. కానీ గ్యాప్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నాకు 'ఇష్టం' సినిమాలో చిన్నవేషం ఒకటి వచ్చింది. ఆ తరువాత కుంచె రఘు .. జూనియర్ రేలంగి గారు నన్ను 'ఇడియట్' సమయంలో పూరి జగన్నాథ్ కి పరిచయం చేశారు. నటీనటుల జాబితాలో చివరన నా పేరు చేరిపోయింది .. లక్కీగా ఆ సినిమాయే నాకు బ్రేక్ ను ఇచ్చింది" అని చెప్పుకొచ్చారు.