Andhra Pradesh: సాక్షర భారత్ ఉద్యోగుల తొలగింపు గంటా నిర్ణయమా? లేక చంద్రబాబు నిర్ణయమా?: విష్ణుకుమార్ రాజు
- ఏపీలో విద్యా శాఖకు చెందిన ఉద్యోగులను తొలగించడం దారుణం
- బాబు వస్తే జాబు వస్తుందన్నారు కానీ, ఉన్నవీ పోతున్నాయి
- ప్రతి విషయాన్ని కేంద్రంపై నెట్టేయడం బాబుకు అలవాటైపోయింది
ఏపీలో ఒక్క మెమోతో విద్యా శాఖకు చెందిన 21 వేల మంది ఉద్యోగులను తొలగించడం వింతగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబు వస్తే జాబు వస్తుందన్నారు, కానీ, ఉన్న జాబులు పోతున్నాయని మండిపడ్డారు. ప్రతి విషయాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టేయడం చంద్రబాబుకు అలవాటైపోయిందని, ఉద్యోగుల తొలగింపు మంత్రి గంటా నిర్ణయమో, లేక సీఎం చంద్రబాబు నిర్ణయమో చెప్పాలని డిమాండ్ చేశారు.
కాగా, ఏపీలో సాక్షర భారత్ ఉద్యోగుల తొలగింపు దారుణమని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. కనీసం, ఉద్యోగులకు నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని, ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.