tet: ఏపీలో ప్రశాంతంగా ముగిసిన టెట్.. రేపు ప్రాథమిక కీ విడుదల
- 26న తుది కీ
- మొత్తం 3,70,576 (93.12శాతం) అభ్యర్థుల హాజరు
- ప్రాథమిక కీపై అభ్యంతరాలకు 23 వరకు గడువు
- 30న టెట్ ఫలితాలు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరీక్షా కేంద్రాలతో పాటు తమిళనాడు, తెలంగాణ, బెంగళూరు (కర్ణాటక)లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో టెట్ ప్రశాంతంగా జరిగింది. టెట్ కు 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 3,70,576 (93.12శాతం) అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. టెట్ ఈ నెల 10 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.
అమరావతి నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు పేరిట విడుదలైన ఓ ప్రకటన ప్రకారం... పేపర్ -1కు 1,69,051 అభ్యర్థులు దరఖాస్తు చేస్తే 1,60,796 మంది (95.12 శాతం), పేపర్ 2ఏ సోషియల్ స్టడీస్ కు 66,922 అభ్యర్థులు దరఖాస్తు చేస్తే 62,467 (93.34) శాతం మంది హాజరయ్యారు.
అలాగే, పేపర్ 2ఏ మ్యాథ్స్ అండ్ సైన్స్ కు 77,832 అభ్యర్థులు దరఖాస్తు చేయగా.. 70,452 మంది హాజరయ్యారు. పేపర్ 2ఏ ల్యాంగ్వేజస్ కు 68,013 మంది దరఖాస్తు చేయగా 61,465 మంది (90.37 శాతం), పేపర్ 2(బీ)కి ఫిజికల్ ఎడ్యుకేషన్ కు 16,139 మంది దరఖాస్తు చేయగా 15,396 (95.40 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.
కాగా, టెట్ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకొన్నామని మంత్రి గంటా తెలిపారు. అభ్యర్థులు పరీక్ష రాసిన తర్వాత బటన్ నొక్కగానే స్క్రీన్ పై తమకు వచ్చిన మార్కులు చూసుకొనే అవకాశం కల్పించామన్నారు. అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు పంపడం, సూచనలు ఇవ్వడం ద్వారా పరీక్షను విజయవంతంగా నిర్వహించామన్నారు.
తొలిసారి ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు టెట్ నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదని పకడ్బందీ ప్రణాళికతో వెళ్లడం ద్వారా టెట్ ను ప్రశాంతంగా నిర్వహించామని మంత్రి గంటా తెలిపారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్ ) ప్రాథమిక కీ 20 నుంచి అందుబాటులో వుంటుందని తెలిపారు. అభ్యర్థుల వారీ రెస్పాన్స్ షీట్లను కూడా 20 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు వుంటే ఈ నెల 20 నుంచి 23 అర్ధరాత్రి 12 గం.ల లోగా టెట్ వెబ్ సైట్ ద్వారా సరైన వివరాలు, ఆధారాలతో ఫిర్యాదు చేయాలని అన్నారు.
ప్రాథమిక వివరాలు పుట్టిన తేది, పేరు, కులం, లింగం తదితర వివరాలు కూడా సరిచేసుకోవచ్చని, ఈ అభ్యర్థులు జూన్ 20 నుంచి 23 లోగా టెట్ వెబ్ సైట్ లోని ఫిర్యాదు బాక్సులో తమ అభ్యర్థనలను వుంచాలని సూచించారు. పీఈటీ, డాన్స్, మ్యూజిక్ మినహా డీఎస్సీకి సంబంధించి సిలబస్ ను వెబ్ సైట్ లో వుంచామన్నారు. తుది కీ ఈనెల 26 న ప్రకటిస్తామని, 30 న టెట్ ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి గంటా వివరించారు.