jaipur: విమానం మిస్సవుతుందని భావించి బాంబు బెదిరింపు ఫోన్ కాల్.. కొరియోగ్రాఫర్ అరెస్టు!

  • ఈరోజు ఉదయం జైపూర్-ముంబై విమానం ఎక్కాల్సిన మోహిత్
  • సరైన సమయానికి అందుకోలేనని భావించి బాంబు బెదిరింపు కాల్
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తాను ఎక్కాల్సిన విమానం అందుకోవడం సాధ్యం కాదని భావించి.. విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన జైపూర్ కొరియోగ్రాఫర్ మోహిత్ కుమార్ ట్యాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఈ రోజు ఉదయం 5.30 గంటలకు బయలు దేరాల్సిన జైపూర్-ముంబై (6ఈ 218 ఇండిగో) విమానంలో బాంబు ఉందంటూ సదరు సంస్థ కాల్ సెంటర్ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన విమానయాన సిబ్బంది.. ఈ సమాచారాన్ని బాంబు నిర్వీర్యం చేసే బృందానికి తెలిపింది. ఈ నేపథ్యంలో విమానంలో సోదాలు చేసిన బృందం..ఎటువంటి బాంబు లేదని.. అదంతా ఒట్టిదేనని తేల్చి చెప్పడంతో విమానం బయలుదేరి వెళ్లింది.  

జైపూర్ కు చెందిన కొరియోగ్రాఫర్ మోహిత్ కుమార్ ఈ బెదిరింపు ఫోన్ కాల్ చేసినట్టు సదరు ఎయిర్ లైన్స్ నిర్ధారించుకుంది. అతను ఈ విమానంలో ముంబై ప్రయాణించాల్సి ఉందని, అయితే, విమానం బయలుదేరే సమాయానికి తాను రాలేనని భావించి ఈ బెదరింపు ఫోన్ కాల్ చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విమానం మిస్సయిన కారణంగా వేరే విమానంలో ప్రయాణించేందుకు టికెట్ ఇస్తామని చెబుతూ, మోహిత్ కుమార్ కు ఇండిగో సంస్థ ఫోన్ చేసింది. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న అతన్ని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తానే ఈ ఫోన్ కాల్ చేశానని ఒప్పుకున్నాడు. దీంతో, సంగ్ నర్ పోలీస్ స్టేషన్ లో మోహిత్ ను అప్పజెప్పగా పోలీసులు విచారణ చేపట్టారు.

  • Loading...

More Telugu News