NN Vorhara: రికార్డు సృష్టించిన గవర్నర్ వోహ్రా.. నాలుగోసారి గవర్నర్ పాలనకు రెడీ!
- ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న బీజేపీ
- కుప్పకూలిన పీడీపీ ప్రభుత్వం
- ఒకే గవర్నర్ చేతిలో నాలుగోసారి పాలన
జమ్ముకశ్మీర్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ అనూహ్యంగా మద్దతు ఉపసంహరించుకుంది. మూడేళ్ల బంధాన్ని తుంచేసుకుని బయటపడింది. దీంతో రాష్ట్రంలో గవర్నర్ పాలన అనివార్యమైంది.
జమ్ముకశ్మీర్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. కాబట్టి గవర్నర్ పాలన తప్పదు. అదే జరిగితే గత పదేళ్ల కాలంలో రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించడం నాలుగోసారి అవుతుంది. నాలుగు దశాబ్దాల్లో ఎనిమిదోసారి. ముఖ్యంగా, గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా హయాంలోనే ఏకంగా నాలుగుసార్లు గవర్నర్ పాలనలోకి వెళ్లడం మరో రికార్డు.
2008లో కాంగ్రెస్ కూటమి నుంచి పీడీపీ బయటకు రావడం ద్వారా ప్రభుత్వం కుప్పకూలింది. ఫలితంగా 174 రోజులు గవర్నర్ పాలన కొనసాగింది. 2014 ఎన్నికల్లో హంగ్ వచ్చింది. దీంతో మరోమారు గవర్నర్ పాలన చేపట్టారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ చనిపోవడంతో మూడోసారి రాష్ట్రం గవర్నర్ చేతుల్లోకి వెళ్లింది. ఇప్పుడు నాలుగోసారి గవర్నర్ పాలనకు రాష్ట్రం సిద్ధమవుతోంది. ఒకే గవర్నర్ చేతిలో రాష్ట్రం నాలుగుసార్లు గవర్నర్ పాలనకు వెళ్లడం అరుదైన ఘటనే.