Dinesh Chandimal: చండీమల్‌పై వేటు పడింది.. బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో ఒక టెస్టు నిషేధం!
- విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్
- తప్పు ఒప్పుకున్న చండీమల్
- ఓ టెస్టు నిషేధం
శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్‌పై ఐసీసీ వేటేసింది. విండీస్‌తో జరిగిన రెండో టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో మూడో టెస్టులో ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు మ్యాచ్ ఫీజులో వందశాతం జరిమానా విధించింది. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని తొలుత బుకాయించిన చండీమల్ తర్వాత నిజాన్ని అంగీకరించాడు. బాల్‌ను షైన్ చేసేందుకు కృత్రిమ పదార్థాన్ని ఉపయోగించినట్టు ఐసీసీ విచారణలో తేలింది.
వీడియో ఫుటేజీ పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ పేర్కొన్నాడు. బంతిపై కృత్రిమ పదార్థాన్ని రాసినట్టు రివ్యూలో స్పష్టంగా కనిపించిందన్నాడు. దానికి లాలాజలం రాసి బంతిని మెరిపించే ప్రయత్నం చేసినట్టు గుర్తించామన్నారు. ఐసీసీ నిబంధనావళిని అనుసరించి అతడిపై చర్యలు తీసుకున్నట్టు వివరించాడు. ఈ విషయంలో మ్యాచ్ అధికారులకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఐసీసీ తెలిపింది.