Mumbai: ఈ ఏటి 'మిస్ ఇండియా'గా తమిళ అందాల భామ అనుకృతి.. సెకండ్ రన్నరప్ గా తెలుగమ్మాయి!
- ముంబైలో మిస్ ఇండియా ఫైనల్ పోటీలు
- హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరికి రెండో స్థానం
- మూడో స్థానంలో ఏపీకి చెందిన కామవరపు శ్రేయారావు
ఈ ఏటి ఫెమీనా మిస్ ఇండియాగా తమిళనాడుకు చెందిన 19 సంవత్సరాల కాలేజి స్టూడెంట్ అనుకృతి వాస్ ఎంపికైంది. ముంబైలో చిత్ర నిర్మాత కరణ్ జోహార్, నటుడు ఆయుష్మాన్ ఖురానా ముఖ్య అతిథులుగా హాజరైన మిస్ ఇండియా ఫైనల్స్ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా, సమయస్ఫూర్తితో సమాధానాలు ఇచ్చిన అనుకీర్తి అందాల సుందరి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది.
మొత్తం 30 మంది ఫైనలిస్టులతో పోటీ పడి అనుకృతి విజయం సాధించింది. హర్యానాకు చెందిన మీనాక్షి చౌదరి రెండో స్థానంలోనూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన కామవరపు శ్రేయారావు మూడో (సెకండ్ రన్నరప్) స్థానంలోనూ నిలిచారు. న్యాయమూర్తుల ప్యానల్ లో ఇండియన్ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్, బాలీవుడ్ సెలబ్రిటీలు మలైకా అరోరా, బాబీ డియోల్, కునాల్ కపూర్ లు ఉన్నారు.
ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ కార్యక్రమంలో మాధురీ దీక్షిత్, కరీనా కపూర్, జాక్వలిన్ ఫెర్నాండెజ్ ల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విజయం సాధించిన అనుకీర్తికి, గత సంవత్సరం విజేత మానుషీ చిల్లర్ కిరీటాన్ని అలంకరించగా, ఇక మిస్ వరల్డ్ 2018 పోటీలపై దృష్టిని పెడతానని విజయం సాధించిన అనుకృతి మీడియాకు తెలిపింది.