Madhya Pradesh: ఐపీఎస్ ఆఫీసర్ అందానికి ఫిదా.. పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్ కు వచ్చి నానాయాగీ చేస్తున్న యువతి!
- ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఎస్పీగా పనిచేస్తున్న సచిన్ అతుల్కర్
- సోషల్ మీడియాలో చూసి మనసు పారేసుకున్న పీజీ విద్యార్థిని
- కౌన్సెలింగ్ ఇవ్వలేక తల పట్టుకుంటున్న పోలీసులు
కేవలం సినిమా హీరోలు లేదా క్రికెట్ స్టార్ల వెంటే అభిమానులు పడుతుంటారని భావిస్తుంటారా? అయితే, మీ ఆలోచన తప్పు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి మూడు రోజుల క్రితం వచ్చిన పంజాబ్, హోషియార్ పూర్ కు చెందిన 27 ఏళ్ల యువతి, తాను ఎస్పీ సచిన్ అతుల్కర్ ను కలవాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉండటంతో పోలీసులు తల పట్టుకున్నారు.
సోషల్ మీడియాలో సచిన్ అతుల్కర్ ఫొటోలను చూసి మనసు పారేసుకున్న సదరు యువతి, ఆయన్ను కలిసి, తన ప్రేమను వ్యక్తపరిచే ఉద్దేశంతో వచ్చినట్టు గుర్తించిన పోలీసులు, ప్రస్తుతం ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఆమెను తిరిగి ఇంటికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని, కానీ ఆమె వినడం లేదని మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ రేఖా వర్మ తెలిపారు. ఎస్పీని కలవాలని ఆమె చాలా పట్టుదలతో ఉందని అన్నారు. ఆమె తల్లిదండ్రులను ఉజ్జయినికి పిలిపించినా, వారితో కలసి వెనక్కు వెళ్లేందుకు సిద్ధంగా లేదని అన్నారు. ఆమె సైకాలజీలో పీజీ చేస్తున్న విద్యార్థిని అని తెలిపారు.
కాగా, పోలీసులు ఆమెను నాగ్డా రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లి, పంజాబ్ వెళ్లే రైలును ఎక్కించాలని చూడగా, ఆమె రైలు కదలగానే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా, చేసేదేమీ లేక వెనక్కు తీసుకొచ్చారు. ఆమె పిజ్జాలు సహా తనకు నచ్చిన ఆహారాన్ని డిమాండ్ చేస్తోందని, తాము ఓపికగా వాటిని అందిస్తున్నామని రేఖా వర్మ తెలిపారు. ఇక ఆమెతో మీటింగ్ విషయమై అతుల్కర్ ను ప్రశ్నించగా, ఓ అధికారిగా తాను ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధమని, వ్యక్తిగత విషయాల్లో మాత్రం తన ఇష్టాయిష్టాలకు వ్యతిరేకంగా నడుచుకోబోనని అన్నారు. కాగా, ప్రస్తుతం బ్రహ్మచారిగా ఉన్న అతుల్కర్, ఫిట్ నెస్ పై అత్యధిక శ్రద్ధను చూపుతారు. రోజుకు 70 నిమిషాలు జిమ్ లో గడిపే ఆయన గతంలో పలు ఫిట్ నెస్ అవార్డులనూ గెలుచుకున్నారు.